ప్రోటోకాల్ పాటించని అధికారులపై చర్యలు తీసుకోండి

జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు
ప్రేరణ మీడియా, కరీంనగర్: ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రోటోకాల్ పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేష్ , జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొరివి అరుణ్ కుమార్ బుధవారం జిల్లా కలెక్టర్ పమేలా కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరీంనగర్ సి.ఎస్.ఐ ప్రాంగణంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయని, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నగర ప్రతినిధులను కలుపుకొని సంబంధిత అధికారులు కార్యక్రమాన్ని సమన్వయం చేసే ప్రయత్నం చేసారనీ చెప్పారు. మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఫోటోను పూర్తిగా విస్మరించారనీ అన్నారు. మొదటిసారి కాదని ఇటీవల సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో (7వ వార్డు) నియోజకవర్గం అయినప్పటికీ అధికారిక ఫోటోలు, సమాచారంలో పొందుపరచలేదనీ గుర్తు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులకు తగిన గౌరవం, గుర్తింపు ఇవ్వడం అత్యంత అవసరం అని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జిల్లా కలెక్టర్ తగు చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మామిడి అనిల్, జీడి రమేష్, సముద్రాల లక్ష్మణ్, జుంజుపల్లి వివేక్, గొట్టే బాబు, కనకం విద్యాసాగర్, యూత్ కాంగ్రెస్ నాయకులు మణికంఠ, తదితరులు పాల్గొన్నారు.
